ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన మరోసారి విమర్శలు గుప్పించింది. గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలను రాబోయే బిహార్ ఎన్నికల కోసం వాడుకుంటున్నారని..తన అధికారిక పత్రిక సామ్నాలో ఆరోపించింది. జూన్ 15న వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో పాల్గొన్న సైనికులకు ప్రధాని మోదీ.. కుల, ప్రాంతీయ కార్డును అంటగడుతున్నారని శివసేన ఆరోపించింది.
'కరోనా కంటే మోదీ చేస్తున్న రాజకీయాలే ప్రమాదకరం' - శివసేన పత్రిక సామ్నా సంపాదకీయం
ప్రధాని నరేంద్ర మోదీపై శివసేన విమర్శలు చేస్తూనే ఉంది. త్వరలో బిహార్ ఎన్నికలు జరగనున్న వేళ.. గల్వాన్ లోయ ఘటనను ఓట్ల కోసం వాడుకుంటారని తన అధికారిక పత్రిక సామ్నాలో రాసుకొచ్చింది.
ఈ మేరకు బిహార్ రెజిమెంట్ సాహసాన్ని కొనియాడుతూ మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నాలో తప్పబట్టింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పుడు అన్నిరకాల బలగాలు విధులు నిర్వహించాయని పేర్కొన్న శివసేన పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మహారాష్ట్రకు చెందిన ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తు చేసింది. కేవలం బిహార్ ఎన్నికల కోసమే.. సైన్యంలో కుల, ప్రాంతీయ వాదాన్ని ముందుకు తెచ్చారని శివసేన ఆరోపించింది. ఈ రాజకీయాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనవని సామ్నా సంపాదకీయంలో శివసేన మండిపడింది.
ఇదీ చూడండి:పిడుగుల వర్షం: 105కు చేరిన మృతుల సంఖ్య