'ఒకే దేశం-ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటు చేయనున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రకటించారు. దిల్లీ వేదికగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం ముగిసిన అనంతరం సమావేశ వివరాలను వెల్లడించారు. నిర్దేశిత సమయంలోగా అన్ని పార్టీలతో చర్చించి అవసరమైన సూచనలు చేసే లక్ష్యంతో ఈ కమిటీ పనిచేస్తుందని వెల్లడించారు. చాలా పార్టీలు ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానానికి అంగీకరించాయని తెలిపారు రాజ్‌నాథ్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కమిటీ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.
"ఎక్కువమంది సభ్యులు ఒకే దేశం-ఒకే ఎన్నికకు మద్దతు తెలిపారు. సీపీఐ, సీపీఎం సభ్యులు ఎలా సాధ్యమవుతుందని భిన్నాభిప్రాయం తెలిపారు. ఇది ఎలా ఆచరణలోకి వస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఒకే దేశం-ఒకే ఎన్నికను విభేదించలేదు. సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒకే దేశం- ఒకే ఎన్నికపై త్వరలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నాం. నిర్దేశించిన సమయం లోపల ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చించి సూచనలివ్వనుంది. ప్రధానమంత్రి ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు."
-రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర రక్షణమంత్రి