ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఆత్మ నిర్భర్ భారత్ ప్రణాళికల గురించి ప్రధాని నరేంద్ర మోదీ సంక్షిప్తంగా వివరిస్తారని చెప్పారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. స్వాతంత్ర్య వీరుడు ఉధంసింగ్‌కు నివాళి అర్పించిన సందర్భంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. మోదీ ప్రవచించిన ఆత్మ నిర్భర్ భారత్‌ను అమలు చేసేందుకు వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు సింగ్. స్వయం సమృద్ధత లేకపోతే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోలేమని కరోనా వైరస్ తెలియచెప్పిందని అన్నారు. దేశ ఆత్మగౌరవానికి, సార్వభౌమత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లనీయబోమని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
"నవ భారత్ గురించి మాట్లాడితే సమృద్ధి, స్వాభిమాన భారత్ అనే గుర్తింపు ఉండాలని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఆత్మ విశ్వాసంతో వాటిని సాకారం చేసుకుంటే ఆత్మ నిర్భర్ భారత్ కూడా సాధ్యం అవుతుంది. ఆత్మ నిర్భర్ భారత్ ఎలా ఉండాలి అనే దానిపై ఎవరి మనసులోనూ ఎలాంటి సందేహం ఉండరాదు. ప్రజలకు ఆహారం, వస్త్రాలు, ఇల్లు, విద్య, వైద్యం కల్పించడంలో ఆత్మ నిర్భరత సాధించాలి."