'మోదీజీ నిరుద్యోగంపై ఒక్కముక్క అయినా మాట్లాడారా?' రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశాన్ని పట్టిపీడుస్తోన్న నిరుద్యోగ సమస్యను పట్టించుకోకుండా.. జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇద్దరూ రాష్ట్రపతికి ధన్యవాదాలు చెబుతూ గంటల తరబడి ప్రసంగించారు కానీ, దేశ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. ఇదివరకు భాజపా ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచుతామని మాట్లాడేది.. కానీ ఇప్పుడు అవన్నీ వదిలి ఇతర అంశాలు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు.
"దేశంలో నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థలే అన్నింటికంటే పెద్ద సమస్యలు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కావాలని యువత కోరుకుంటోంది. పార్లమెంట్లో మోదీ రెండున్నర గంటలు ప్రసంగించినప్పుడు.. ఒక్క రెండు నిమిషాలైనా యువకులకు ఉద్యోగ కల్పన గురించి వివరించమని మేము పదుల సార్లు అడిగాం. కానీ ప్రధాని సమాధానం ఇవ్వలేదు. ఈ విషయం యావత్ భారత యువత గమనించింది. పైగా ఎప్పుడూ కాంగ్రెస్, జవహర్లాల్ నెహ్రూ, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల గురించి ఏదేదో మాట్లాడుతూ ప్రజల దృష్టిని మళ్లిస్తూంటారు. సమస్యల నుంచి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమే ప్రధాని ప్రత్యేక శైలి. ఆయన రెండు కోట్ల మంది యువకులకు ఉద్యోగాలిస్తానన్నారు. ఐదున్నరేళ్లైంది.. మరి గతేడాది కోటి మంది ఉద్యోగాలు కోల్పోయారని మేము అడిగినప్పుడు ప్రధాని ఒక్క ముక్క మాట్లాడలేకపోయారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ముఖ్య నేత
ఇదీ చదవండి:రాహుల్‌పై ప్రధాని మోదీ 'ట్యూబ్‌లైట్ పంచ్'!