తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంను వణికిస్తున్న వరదలు- 11 మంది మృతి - అసోం

ఈశాన్య భారతాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అసోంలో 11 మంది మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్​కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేశారు. వరద పరిస్థితులపై ఆరా తీశారు.

అసోంను వణికిస్తున్న వరదలు-11 మంది మృతి

By

Published : Jul 15, 2019, 5:51 PM IST

Updated : Jul 15, 2019, 7:14 PM IST

అసోంను వణికిస్తున్న వరదలు- 11 మంది మృతి

భారీ వర్షాలు, వరదలు అసోం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి బలైన వారి సంఖ్య 11కు చేరింది. మొత్తం 31 జిల్లాలల్లో 26.5 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురైనట్లు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

బార్‌పేట జిల్లాపై వరద ప్రభావంతో 7.5 లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరం చేసిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది... నిరాశ్రయులను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 327 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశారు.

ప్రమాదకర స్థాయిలో బ్రహ్మపుత్ర...

వరద నీరు పోటెత్తి బ్రహ్మపుత్ర నదిలో గంటగంటకు నీటిమట్టం పెరుగుతోంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

వన్యప్రాణులపై ప్రభావం...

భారీ వర్షాలు, వరదలకు వన్యప్రాణుల జీవనంపై తీవ్ర ప్రభావం పడింది. మజులిలో సోమవారం వరదల్లో చిక్కుకున్న నాలుగు జింకలను అటవీ శాఖ అధికారులు రక్షించారు. ఈ ప్రాంతంలో సుమారు 150 ఏనుగులు ఆహారం దొరక్క అల్లాడుతున్నట్లు తెలిపారు. ఆహారం వెతుక్కుంటూ గజరాజులు జనావాసాల్లోకి వస్తున్నాయి.

ముఖ్యమంత్రికి ప్రధాని ఫోన్​

అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేశారు. రాష్ట్రంలో వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నిరకాల సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: నదిలో దూకి బాలికను కాపాడిన జవాన్లు

Last Updated : Jul 15, 2019, 7:14 PM IST

ABOUT THE AUTHOR

...view details