" స్వయంసమృద్ధ భారత్‌కు అవినీతి ఓ పెద్ద అవరోధంగా మారింది. ఇప్పుడు అది ఒక్కటే మనకు సవాల్ విసరడం లేదు. ఆర్థిక నేరాలు, మాదకద్రవ్యాల సరఫరా, అక్రమ నగదు చలామణి, ఉగ్రవాదులకు నిధుల అందజేత వంటివన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. అందుకే మనం అవినీతిపై గట్టి నిఘా ఉంచాలి. దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాలను పెంచుకోవాలి. అన్ని శక్తులు కూడదీసుకొని పూర్తిస్థాయి యుద్ధం చేయాలి."
-అవినీతి వ్యతిరేక సదస్సులో ప్రధాని మోదీ
దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోన్న భారీ అవినీతి దేశానికి పెను సవాల్ విసురుతోందని, చెదపురుగులా పట్టి తొలిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా మారిన కుంభకోణాలు కొన్ని రాష్ట్రాల రాజకీయ సంస్కృతిలో అంతర్భాగమై పోయాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడకపోతే, ఆ తర్వాత వచ్చే తరం మరింతగా రెచ్చిపోతుందని హెచ్చరించారు. నల్లధనం కూడబెట్టే వారిపై ఎలాంటి చర్యలు లేకపోయినా, చిన్న శిక్షతో సరిపెట్టినా చుట్టుపక్కలున్న వారికి మరింత ధైర్యం వస్తుందన్నారు. మంగళవారం ప్రారంభమైన ‘నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్’ సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
" అవినీతి కేసుల దర్యాప్తులో జరిగే జాప్యం ఒక్క కేసుకే పరిమితం కాదు. అది ఒక శృంఖలాన్ని తయారుచేస్తుంది. భవిష్యత్తు కుంభకోణాలకు అది పునాది రాయిలా మారుతుంది. అక్రమార్కులపై తగిన చర్య తీసుకోకపోతే సమాజంలో నేరాలకు పాల్పడటం సాధారణమైన వ్యవహారంగా మారిపోతుంది. మన ముందున్న వ్యక్తి తప్పుడు మార్గంలో వేలకోట్ల రూపాయలు సంపాదించాడని తెలిసినా సహజంగా చూడటం ప్రారంభమవుతుంది. అది దేశ అభివృద్ధికి తీవ్ర అవరోధంగా మారుతుంది" అని మోదీ వివరించారు. "వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, డొల్ల (షెల్) కంపెనీల విస్తరణ, పన్ను చోరీలు ఏళ్ల తరబడి చర్చనీయాంశాలుగా నిలిచాయి. దేశం ఇలాగే నడుస్తుంది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్న ఆలోచనల్ని మార్చడం కోసం నేను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నల్లధనం వెలికితీతకు కమిటీ నియమించా. అవినీతిని ఏమాత్రం సహించబోమనే విధానంతో ముందడుగు వేస్తున్నాం. 2014 నుంచి ఇప్పటివరకు దేశ పరిపాలన, బ్యాంకింగ్, ప్రణాళిక, వైద్యం, విద్య, కార్మిక, వ్యవసాయరంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చాం. ఈ సంస్కరణలను ఆధారంగా చేసుకొని మన దేశం స్వావలంబన సాధించే దిశగా ముందుకెళ్తోంది. భారత్‌ను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే మా ధ్యేయం" అని మోదీ తెలిపారు.