తూర్పు లద్దాఖ్ సరిహద్దులో హద్దు మీరుతున్న చైనా తీరును ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా ఖడించాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. చైనా దుశ్చర్యలకు దీటుగా బదులిచ్చేలా పటిష్టమైన, వేగవంతమైన చర్యలకు మోదీ ఉపక్రమించాలన్నారు. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
భారత భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించాలని చూస్తే వారికి సరైన రీతీలో బుద్ధి చెబుతామని జాతినుద్దేశించి మోదీ ప్రసంగించి హామీ ఇవ్వాలని కోరారు సిబల్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు వినతి చేశారు. మోదీ హామీ ఇస్తే ప్రతిపక్షాలు సహా యావత్ దేశం ఆయనకు మద్దతుగా నిలబడుతుందని సిబల్ అన్నారు.
"గత ఆరేళ్లలో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దౌత్యపరంగా దారుణంగా వైఫల్యం చెందింది. వాస్తవాధీన రేఖ వద్ద సమస్యను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలి. దౌత్యపరమైన, ఆర్థికపరమైన ఆంక్షలకు చైనా తలొగ్గదు. భారత్ తీసుకునే చర్య పటిష్టంగా ఉండాలి. ఎప్పుడు, ఎలాంటి చర్య తీసుకోవాలనే నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలి."