ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునేందుకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే విషయంలో సాహసోపేతంగా వ్యవహరించాలని ప్రధాని నరేంద్రమోదీని కోరింది కాంగ్రెస్. జీడీపీలో కనీసం 5-6శాతం విలువ ఉండే ప్యాకేజీ తీసుకురావాలని సూచించింది. రాష్ట్రాలకు పెండింగ్ బకాయిలన్నీ చెల్లించి, విడివిడిగా ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్.
"ఇవి అసాధారణ పరిస్థితులు. అందుకే అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లాక్డౌన్ తర్వాత ప్రధాని ఆర్థిక ప్యాకేజీని ధైర్యంగా ప్రకటించాలి. ఆ ప్యాకేజీ విలువ జీడీపీలో 5-6శాతం ఉండాలి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు తమ జీడీపీలో 15 శాతం ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాయి. అమెరికా 10 శాతం కేటాయించింది."
-ఆనంద్ శర్మ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
పీఎం కేర్స్ నిధి తరహాలో వివిధ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు పారిశ్రామిక వర్గాలు అందించే విరాళాలను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద పరిగణించాలని కోరారు శర్మ. ఒకవేళ అలా చేయకపోతే రాష్ట్రాల పట్ల వివక్ష చూపినట్లేనని ఆరోపించారు.
దేశంలో లాక్డౌన్ అత్యవసరంగా విధించినందున.. దశలవారీగా ఆంక్షలను ఎత్తివేసే క్రమంలో అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని, పేదల బాధలు తగ్గేలా చూడాలన్నారు ఆనంద్ శర్మ. కరోనా సంక్షోభం నేపథ్యంలో ఔషధ, బీమా, ఆర్థిక రంగ పరిశ్రమలను విదేశీ సంస్థలు స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించాలని సూచించారు. పరిశ్రమల పునురద్ధరణ కోసం ఎంఎస్ఎంఈ రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.