ఏదైనా సంక్షోభం తలెత్తినప్పుడు సమాజంలోని అట్టడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నష్టపోతుంటాయి. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వర్గంగా చెప్పుకునే యువత ముఖ్యంగా కళాశాల విద్యార్థులు మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వారికి సాయమందించే దిశగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు కేంద్రమంత్రి రమేశ్ పోఖ్రియాల్. https://helpline.aicte-india.org వెబ్ అడ్రెస్ ద్వారా విద్యార్థులు తమకు అవసరమైన సహకారాన్ని పొందొచ్చు.
వెబ్‌సైట్ లక్ష్యం
లాక్డౌన్ కారణంగా చాలామంది హాస్టళ్లలోనే ఉండిపోయారు. అద్దె ఇళ్లలో, వసతి గృహాల్లో నివాసం ఉంటున్నారు. వారికి సహకరించడమే ఈ వెబ్‌సైట్ లక్ష్యం. ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను కుటుంబం, పాఠశాలలు, కళాశాలలతో అనుసంధానించడం.. మానసిక, అత్యవసరమైన వ్యక్తిగత అవసరాలను తీర్చడం లక్ష్యాలుగా ఈ వెబ్‌సైట్ పనిచేస్తుంది.
ఏఐసీటీఈ చీఫ్ కో ఆర్డినేటింగ్ ఆఫీసర్ బుద్ధ చంద్రశేఖర్, గ్రాఫిక్ ఎరా విశ్వవిద్యాలయానికి చెందిన ఇంటర్న్ విద్యార్థులు శివాన్షు, ఆకాష్‌లు ఈ వెబ్‌సైట్‌ను ఏప్రిల్ 3న ఒకే ఒక్క రోజు వ్యవధితో రికార్డు సమయంలో ప్రారంభించారు.