మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాల హడావుడి తారస్థాయికి చేరింది. ర్యాలీలతో అగ్రనేతలు తీరిక లేకుండా గడుపుతున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం కూడా రసవత్తరంగా సాగుతోంది.
తాజాగా అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్. శాసనసభ ఎన్నికల్లో విపక్షాలు అసలు పోటీ ఇవ్వలేకపోతున్నాయన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు పవార్. సీఎం వ్యాఖ్యలే నిజమైతే.. రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంత పెద్ద స్థాయిలో ర్యాలీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.
చాలీసగావ్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఎన్సీపీ అధ్యక్షుడు.. అధికార పార్టీని ఓడించడానికి యువత సిద్ధమవుతుండటం వల్ల భాజపా నిద్రలేని రాత్రులు గడుపుతోందన్నారు.