ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో వర్చువల్గా పాల్గొని ఫారంభోపన్యాసం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే టీకా పంపిణీకి మొబైల్ సాంకేతికతనే ఉపయోగించనున్నట్లు చెప్పారు. కరోనా సంక్షోభ కాలంలో మొబైల్ సాంకేతికత ద్వారానే లక్షలాది మందికి అవసరమైన సాయం అందినట్లు మోదీ పేర్కొన్నారు.
భారత్లో మొబైల్ టారిఫ్లు అత్యంత చౌకగా ఉన్నాయన్నారు ప్రధాని. యాప్ మార్కెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. మొబైల్ తయారీకి అత్యంత అనునైన ప్రదేశంగా భారత్ ఎదుగుతోందని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో దేశంలోని ప్రతి గ్రామంలో హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ డేటా సదుపాయం ఉంటుందని చెప్పారు.
"మీ ఆవిష్కరణలు, ప్రయత్నాల కారణంగానే కరోనా కాలంలోనూ ప్రపంచం కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించింది. మీ ప్రయత్నాల వల్ల ఒక నగరంలో కుమారుడు వేరే నగరంలో ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడగలుగుతున్నాడు. తరగతి గదిలో లేకుండానే ఓ విద్యార్థి ఉపాధ్యాయుని ద్వారా పాఠాలు నేర్చుకుంటున్నాడు. భవిష్యత్తులో లక్షలాదిమంది భారతీయులను శక్తిమంతం చేసేందుకు సమయానుగుణంగా 5జీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మనమందరం కలిసి పనిచేయాలి. సాంకేతికత ఆధునికీకరణ కారణంగా మొబైల్ పోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను తరచూ మార్చడం సంస్కృతిగా మారింది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల మెరుగైన నిర్వహణకు, పునరుత్పాదక ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు సరికొత్త ఆలోచనల కోసం పరిశ్రమ ఒక టాస్క్పోర్స్ను ఏర్పాటు చేయగలదా? "