తెలంగాణ

telangana

'మోదీ ముఖంలోని మెరుపుతో సమస్యలు పరార్!'

By

Published : Oct 22, 2020, 6:31 PM IST

జాతినుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగంపై శివసేన వ్యంగ్యంగా స్పందించింది. ఓవైపు.. ప్రసంగాన్ని వ్యతిరేకించే అంశాలేవీ లేవని చెబుతూనే.. ప్రధాని చెప్పిన మాటల్లో కొత్తేం ఉందంటూ ప్రశ్నించింది. ప్రధాని ముఖంలోని మెరుపు దేశంలోని సమస్యలను తొలగిస్తుందని ఎద్దేవా చేసింది.

PM remained mum on many issues but speech was `crisp': Shiv Sena
'మోదీ ముఖంలోని మెరుపుతో సమస్యలు పరార్!'

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాన సమస్యలపై మోదీ మౌనంగానే ఉన్నారని పేర్కొంది. అయితే ప్రసంగాన్ని వ్యతిరేకించే అంశాలేవీ లేవని చెప్పుకొచ్చింది. గత కొద్ది నెలల్లో మోదీ చేసిన అద్భుతమైన ప్రసంగాల్లో ఇదొకటని వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

ప్రధాని ముఖంపై ప్రకాశవంతమైన మెరుపు కనిపించిందని, దేశంలోని సమస్యలను అది తొలగిస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఈ మేరకు అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించింది.

"ప్రధాని మోదీ ఈ ప్రసంగంతో దేశ ప్రజలకు ఏం చెప్పారు? ఇందులో కొత్తేం ఉంది? మహారాష్ట్రలోని వరద బాధితులకు సాయం చేస్తామని మాటిచ్చారా? ఎలాంటి ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు? అని ఇలాంటి విమర్శలు చేయొచ్చు. కానీ ఆయన ప్రసంగం చిన్నగా, ప్రభావవంతంగా ఉంది.

కరోనావైరస్ గురించి ఆయన చెప్పింది పూర్తిగా సరైనదే. ఆయన వచ్చారు, మాట్లాడారు. ఆయన ముఖంలో ప్రకాశవంతమైన మెరుపు... దేశంలోని విపత్తుల చీకటిని తొలగించేస్తుంది."

-సామ్నా పత్రికలో సంపాదకీయం

దేశంలో ఆర్థిక కార్యకలాపాలు పునఃప్రారంభం కావడంపై మోదీ మాట్లాడారు కానీ.. నిరుద్యోగం ఊసెత్తలేదని ఎద్దేవా చేసింది. లద్దాఖ్​లో చైనా అతిక్రమణలపై ఒక్క మాట మాట్లాడలేదని వ్యాఖ్యానించింది.

"లద్దాఖ్​​లో చైనా చొరబాట్లపై మాట్లాడాలని ప్రసంగానికి ముందు మోదీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. మోదీ ఈ విషయంపై స్పందించనేలేదు. ఆయన ప్రసంగం చిన్నగా స్ఫుటం(క్రిస్పీ)గా ఉంది. ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు సాగిన ఈ ప్రసంగం గత ఏడు నెలలలోనే ఉత్తమమైనది."

-సామ్నా పత్రికలో సంపాదకీయం

ఎక్కువ మంది గుమిగూడే ప్రదేశాలను ఇప్పుడే తెరవకూడదని మోదీ చేసిన వ్యాఖ్యలను సామ్నా గుర్తు చేసింది. మహారాష్ట్రలో ఆలయాలను తెరిచే అంశంపై గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో వివాదం మధ్య ఈ వ్యాఖ్యలను ప్రస్తావించింది.

ఇదీ చదవండి-వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు: మోదీ

ABOUT THE AUTHOR

...view details