కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ చేశారు. మాతృభూమి కోసం అమరులు చేసిన త్యాగాలకు హృదయపూర్వక వందనాలు తెలిపారు. సైనికులు ధైర్య సాహసాలకు, అంకితభావానికి విజయ్ దివస్ ప్రతీక అన్నారు మోదీ.
కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులతో మోదీ - PM
యుద్ధ సమయంలో తాను కార్గిల్‌ను సందర్శించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్టు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. విజయ్ దివస్ సందర్భంగా ట్వీట్ చేశారాయన. భరతమాత ముద్దుబిడ్డల త్యాగాలను దేశం మరువదన్నారు మోదీ.
సైనికులతో దిగిన ఫొటోలు ట్యాగ్
యుద్ధ సమయంలో తాను జమ్ము కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు మోదీ. ఆ సమయంలో తాను కార్గిల్‌ను సందర్శించిన ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కార్గిల్‌లో సైనికులను కలిసి మాట్లాడుతున్న ఫొటోలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కలిసిన ఫొటోలను ట్యాగ్ చేశారు. కార్గిల్ యుద్ధ సమయంలో పరాక్రమవంతులైన భారత సైనికులను కలిసి వారికి సంఘీభావం తెలిపే అవకాశం దక్కిందన్నారు. నాడు భారత సైనికులను కలిసి మాట్లాడటం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకమన్నారు ప్రధాని.