భారత ప్రధాని నరేంద్ర మోదీ.. కొత్తగా ఏది చెయ్యాలన్నా ఏమాత్రం వెనకడుగువెయ్యరు. తాజాగా ఆయన... డిస్కవరీ ఛానల్ ప్రసారం చేసే ప్రఖ్యాత కార్యక్రమం మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను ఆ ఛానల్ విడుదల చేసింది. ప్రపంచ ప్రముఖ సాహసవీరుడు బేర్ గ్రిల్స్‌తో మోదీ కలిసి చేసిన సాహస ప్రయాణాన్ని డిస్కవరీ ఛానల్ ఆగస్ట్ 12న చూపించబోతోంది. ఇందుకు సంబంధించి సమాచారాన్ని బేర్ గ్రిల్స్... తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. మోదీ తనతో కలిసి ఎలాంటి సాహసాలు చేశారో...ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న 180 దేశాల్లో ప్రేక్షకులు చూడాలని కోరారు.
'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో మోదీ సాహసాలు - Modi
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' కార్యక్రమంలో భారత ప్రధాని మోదీ కనిపించనున్నారు. ప్రముఖ సాహస వీరుడు బేర్ గ్రిల్స్‌తో కలిసి మోదీ చేసిన సాహసాలు డిస్కవరీ ఛానల్లో ఆగస్టు 12న ప్రసారం కానున్నాయి. ఇదే విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు గ్రిల్స్.
పర్యావరణ మార్పులకు సంబంధించిన విషయాలపై ప్రత్యేక కథనంగా ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మోదీలో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నట్లు చెప్పి... ఈ కార్యక్రమంపై ఆసక్తిని పెంచారు. వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టికోణంతో భారత్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో ఈ కార్యక్రమాన్ని చిత్రీకరించారు. భారతదేశ మహోన్నతమైన ప్రకృతి సంపదను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు. ప్రధాని మోదీతో కలిసి భారతదేశ అరణ్య ప్రాంతాల్లో సాహసాలు చేయడం గౌరవంగా భావిస్తున్నానని బేర్ గ్రిల్స్ తెలిపారు.