దేశంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇవాళ జరిగే వర్చువల్ గ్లోబల్ ఇన్వెస్టర్ రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సదస్సులో పాల్గొనే ప్రపంచంలోని టాప్ 20 సంస్థాగత పెట్టుబడిదారులతో ప్రధాని భేటీ కానున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులైన సావరిన్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ సహా అమెరికా, ఐరోపా, కెనడా, కొరియా, జపాన్, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్ దేశాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారులు ఇందులో పాల్గొననున్నారు. వీటి ఆధీనంలో సుమారు 6 ట్రిలియన్ డాలర్ల నిధుల ఉన్నాయి. వీజీఐఆర్- 2020లో ప్రధానంగా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు చేర్చటం, ఆర్థిక విధానాలు, సంస్కరణలు, పెట్టుబడులకు అవకాశాలపై చర్చించనున్నారు.