దేశంలోని ప్రతిపౌరునికి వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే చేపట్టాల్సిన చర్యలపై శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, విపత్తు నిర్వహణ తరహాలో వ్యాక్సిన్ పంపిణీ, నిర్వహణకు కూడా సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు మోదీ. అవసరమైతే ప్రభుత్వ సంస్థలు, పౌర సంఘాల సహకారం తీసుకోవాలన్నారు. దేశ భౌగోళిక పరిధి, వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వ్యాక్సిన్ను అందరూ పొందేలా చర్యలు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు ప్రధాని మోదీ.
పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలతో.. వ్యాక్సిన్ పరిశోధన సామర్థ్యాలు బలోపేతం చేసేందుకు భారత శాస్త్రవేత్తలు, పరిశోధన బృందాలు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది. తమ దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్, ఖతార్ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపింది.