భవిష్యత్తులో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా.. ఏ దేశంలో నివసిస్తున్నా.. మాతృభూమిని గుర్తుంచుకోవాలని ఐఐటీ మద్రాసు విద్యార్థులను కోరారు ప్రధాని మోదీ. 56వ స్నాతకోత్సవంలో పాల్గొన్న మోదీ.. విద్యార్థుల తల్లిదండ్రలు, ఉపాధ్యాయులను అభినందించారు.
ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ - చెన్నై చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
12:32 September 30
మాతృభూమిని గుర్తుంచుకోవాలి
11:54 September 30
ఐఐటీ స్నాతకోత్సవానికి మోదీ
ఐఐటీ మద్రాసులో జరగుతున్న 56వ స్నాతకోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిషాంక్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పాల్గొన్నారు.
10:56 September 30
నవ్వులు పూయించిన ప్రధాని
ఐఐటీ మద్రాసులో జరిగిన హ్యాకథాన్ విజేతలకు అవార్డుల ప్రదానం కార్యక్రమంలో నవ్వులు పూయించారు ప్రధాని మోదీ.. ఒక వ్యక్తి శ్రద్ధగా ఉన్నారో లేదో గుర్తించే కెమెరా తనకు బాగా నచ్చిందన్న ప్రధాని... ఈ కెెమెరాను పార్లమెంట్లో వినియోగించేందుకు స్పీకర్‌తో మాట్లాడతానన్నారు. మోదీ ఆ మాట అనగానే... కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఒక్కసారిగా నవ్వులు విసిరారు.
10:49 September 30
ప్రత్యేక ఎగ్జిబిషన్ సందర్శన
ఐఐటీ మద్రాసులో జరిగిన సింగపూర్-ఇండియా-2019 హ్యాకథాన్ విజేతలకు అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని. ఇందులో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే పరిజ్ఞానాన్ని కనుగొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు ప్రధాని. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన రీసెర్చ్ పార్క్ అంకుర సంస్థల ప్రదర్శనను తిలకించారు.
10:21 September 30
హ్యాకథాన్ విజేతలకు అవార్డులు అందజేత
ప్రధాని నరేంద్ర మోదీ ఐఐటీ మద్రాసుకు చేరుకున్నారు. అక్కడే జరగుతున్న సింగపూర్-ఇండియా హ్యాకథాన్-2019 విజేతలకు అవార్డులు ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. అనంతరం ఐఐటీ మద్రాసు రీసెర్చ్ పార్క్ అంకుర సంస్థల ప్రదర్శనలో పాల్గొననున్న ప్రధాని.
09:53 September 30
130 కోట్ల మంది సహకారం కావాలి : మోదీ
ప్రపంచం భారత్ నుంచి చాలా ఆశిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రపంచ దేశాలు కోరుకుంటున్న మాదిరిగానే.. దేశాన్ని నడిపిస్తామన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటిస్తున్నారు మోదీ. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం. అనంతరం అక్కడి ప్రజలతో కాసేపు ముచ్చటించిన ప్రధాని.. దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలంటే అందుకు 130 కోట్ల మంది ప్రజల సహకారం కావాలన్నారు. అలాగే ఇటీవలి తన అమెరికా పర్యటనలో భాగంగా.. తమిళ భాషను అత్యంత ప్రాచీనమైనదిగా ప్రపంచ దేశాలకు వివరించినట్లు తెలిపారు మోదీ.
09:22 September 30
చెన్నై చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెన్నై చేరుకున్నారు. మొదటగా.. సింగపూర్-ఇండియా హ్యాకథాన్ పోటీల్లో విజేతలకు మోదీ పురస్కారాలు అందజేయనున్నారు. అనంతరం ఐఐటీ మద్రాసులో జరిగే 56వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు ప్రధాని.
తమిళనాడులోని ఐఐటీ మద్రాసు స్నాతకోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నేడు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో తను చేయబోయే ప్రసంగానికి విలువైన సలహాలు, సూచనలు అందించాలని ఆయన దేశ ప్రజలను కోరారు.
ముఖ్యంగా ఐఐటీ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ ఆలోచనల్ని తప్పుకుండా పంచుకోవాలని మోదీ విజ్ఞప్తి చేశారు. నమో యాప్‌లోని ఓపెన్ ఫోరం ద్వారా తమ సలహాల్ని పంపించవచ్చని తెలిపారు.
హ్యాకథాన్ విజేతలకు..
చెన్నైలో జరిగే మరో కార్యక్రమంలో సింగపూర్-ఇండియా హ్యాకథాన్ పోటీల్లో విజేతలకు మోదీ.. పురస్కారాలు అందజేయనున్నారు. హ్యాకథాన్‌ని యువశక్తి, సృజనాత్మకతల కలయికగా అభివర్ణించారు ప్రధాని. దేశం ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం కనుగొనే యువతరాన్ని ఇలాంటి పోటీలు.. ఒక వేదిక మీదకు తీసుకొస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు.