కరోనా నేపథ్యంలో దేశంలో నిత్యావసర సరుకుల కొరత రాకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సరుకులు దొరకవన్న ఆందోళనతో ఒక్కసారిగా కొనిపెట్టుకునే ప్రయత్నం చేయవద్దని ప్రజలను కోరారు.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతినుద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ.
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి " ఈ సందర్భంగా దేశ ప్రజలకు భరోసా కల్పిస్తున్నా. పాలు, నిత్యవసర వస్తువులు, ఆహారపదార్థాలు, మందులు, జీవనానికి కావాల్సిన వస్తువుల కొరత లేదు. భయాందోళనలతో ఎలాంటి సామగ్రిని కొనుగోలు చేయోద్దని ప్రజలను కోరుతున్నా. భయంతో కాదు, సాధారణంగానే కొనుగోలు చేయండి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దేశంలోని సంపన్న వర్గాలు.. వారి వద్ద పని చేసే వారి ఆర్థిక అవసరాల్లో ఆదుకోవాలని సూచించారు మోదీ. మానవతా దృక్పథంతో ఆలోచించి వేతనాల్లో కోతలు పెట్టొద్దన్నారు. దృఢ సంకల్పంతో ఈ సవాల్‌ను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత మన ముందుందని... మనల్ని మనం కాపాడుకుందాం.. దేశాన్ని కాపాడుదాం అని పిలుపునిచ్చారు ప్రధాని.
ఎకనామిక్ టాస్క్‌ఫోర్స్
ఆర్థిక రంగంపై కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రధాని మోదీ. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్‌ఫోర్స్ పని చేయనున్నట్లు వెల్లడించారు. వ్యక్తులు, సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేస్తుందన్నారు.