దేశవ్యాప్తంగా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 90వేలకుపైగా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో.. మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కరోనా కట్టడిలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మండిపడింది. భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.
ప్రస్తుత పరిస్థితులకు.. ప్రభుత్వ ఉదాసీనత, అసమర్థతే కారణమని మండిపడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. నిపుణులు, కాంగ్రెస్ హెచ్చరించినప్పటికీ.. మహమ్మారిని నియంత్రించేందుకు 'టెస్ట్-ట్రేస్-ఐసొలేట్- ట్రీట్' విధానాన్ని కేంద్రం అవలంబించలేదని దుయ్యబట్టారు. పరీక్షలు పెంచాల్సిన సమయంలో పట్టించుకోలేదని.. లాక్డౌన్ కాలంలో ట్రేసింగ్ కోసం సరైన చర్యలు చేపట్టలేదని ఆరోపించారు.
"కరోనా సంక్షోభంతో ముందుకు సాగేందుకు రచించిన వ్యూహాలను ప్రధాని మోదీ ప్రజలకు వివరించాలి. తన విఫల నాయకత్వంపై ప్రజలకు మోదీ సమధానమిస్తారా? ప్రమాదకర రీతిలో విజృంభిస్తున్న కరోనాను ప్రభుత్వం ఎలా అడ్డుకుంటుంది?"
--- రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి.