వ్యవసాయ సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. ఆహార భద్రతా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఈ చట్టాలు ఓ మార్గమని ధ్వజమెత్తారు. రైతులపై ఇది దాడి చేయడమేనని అన్నారు. దేశంలోని ప్రస్తుత వ్యవసాయ విధానాన్ని ధ్వంసం చేసే 'నల్ల చట్టా'లకు వ్యతిరేకంగానే 'ఖేతీ బచావో యాత్ర' చేపట్టినట్లు తెలిపారు.
పంజాబ్ పాటియాలాలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్.. లాక్డౌన్లో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనకు ఈ వ్యాపారాలే వెన్నుదన్నుగా ఉన్నాయని అన్నారు. కరోనా కాలంలోనూ వ్యాపారులు, కార్మికులకు కేంద్రం ఆపన్నహస్తం అందించలేదని మండిపడ్డారు. ఫిబ్రవరిలోనే కొవిడ్ గురించి హెచ్చరించానని, కానీ.. తన వ్యాఖ్యలను హాస్యాస్పదంగా భావించారని చెప్పుకొచ్చారు.
సరిహద్దులో చైనా దూకుడు నేపథ్యంలో మోదీ లక్ష్యంగా విమర్శలు కురిపించారు రాహుల్.