తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​ను కొత్త శిఖరాలకు చేర్చే దిశగా ఏడాది పాలన' - Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas

భారత్‌ను అంతర్జాతీయంగా నాయకత్వ స్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా తమ ఏడాది పాలన సాగిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఎన్​డీఏ సర్కార్‌ రెండోసారి అధికారం చేపట్టి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా ప్రజలకు బహిరంగ లేఖ రాశారు ప్రధాని. ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిర వివాద పరిష్కారం, ట్రిపుల్‌ తలాక్​‌ను నేరంగా పరిగణించడం, పౌరసత్వ సవరణ చట్టం తమ ఏడాది పాలనలో సాధించిన విజయాలుగా తన లేఖలో పేర్కొన్నారు.

modi
'భారత్​ను కొత్త శిఖరాలకు చేర్చడమే లక్ష్యం'

By

Published : May 30, 2020, 10:19 AM IST

Updated : May 30, 2020, 10:44 AM IST

ఎన్​డీఏ ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఏడాది కాలంలో కేంద్రప్రభుత్వం సాధించిన విజయాలను లేఖ ద్వారా ప్రజలకు వివరించారు. భారత్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే కలను నెరవేర్చేందుకు, అంతర్జాతీయ నాయకత్వం వహించేలా చేసేందుకే తమను రెండోసారి దేశ ప్రజలు ఎన్నుకున్నారని లేఖలో ప్రస్తావించారు మోదీ. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ఏడాది పాలనలో నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

కరోనాపై విజయం దిశగా..

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్​పై పోరులో భారత్ ఐక్యంగా నిలబడిందన్నారు ప్రధాని. యావత్​ దేశం మహమ్మారికి ఎదురొడ్డి నిలిచి పోరాడుతోందన్నారు. త్వరలోనే వైరస్​పై విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని. కరోనా వేళ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు రూ. 20 లక్షల కోట్లతో ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఈ ప్యాకేజీ ద్వారా భారత్ సాధికారత దిశగా ముందుకు సాగుతుందని మోదీ చెప్పారు.

ఆర్టికల్​ రద్దు, సీఏఏ..

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని తొలగించే ఆర్టికల్ 370 రద్దు ద్వారా భారత్ ఐక్యతా స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లినట్లు లేఖలో పేర్కొన్నారు మోదీ. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా గత ఆగస్టులో విభజించినట్లు గుర్తుచేశారు. భారత్‌ చుట్టుపక్కల ఉన్న.. మూడు ముస్లిం మెజార్టీ దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు దేశ పౌరసత్వం ప్రసాదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం భారతదేశ దయాగుణాన్ని, కలుపుకునిపోయే తత్వాన్ని చాటిందని ఆయన అభివర్ణించారు.

రామమందిర కల సాకారం దిశగా..

రామమందిర అంశంలో సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పు శతాబ్దాలుగా జరుగుతున్నట్లు చర్చకు సామరస్య ముగింపును ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.

తలాక్​కు.. తలాక్

తక్షణం ముమ్మారు తలాక్ చెప్పే అనాగరిక సమస్యను తాము చెత్తబుట్టలో వేసినట్లు మోదీ బహిరంగలేఖలో ప్రస్తావించారు. తక్షణ ట్రిపుల్‌ తలాక్​‌ను మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించే నేరంగా మార్చుతూ తెచ్చిన చట్టాన్ని లేఖలో ప్రస్తావించారు.

రైతు సంక్షేమమే ధ్యేయం..

ప్రస్తుతం పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో దేశంలోని రైతులందరినీ చేర్చినట్లు చెప్పారు. 9 కోట్ల 50 లక్షల రైతుల ఖాతాల్లో ఒక్క ఏడాదిలోనే రూ. 72 వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. దేశంలో 50 కోట్ల పశువులు, జీవాల ఆరోగ్య రక్షణకు ఉచిత టీకా కార్యక్రమాన్ని అమలు చేసినట్లు వెల్లడించారు. దేశ చరిత్రలో తొలిసారి.. రైతులు, వ్యవసాయ కూలీలు, చిరు వ్యాపారులు, అసంఘటిత రంగానికి చెందిన వారికి చేయూత అందించే దిశగా కార్యక్రమాలు చేపట్టామన్నారు.

గగన్​యాన్, సాధికారత

మిషన్ గగన్‌ యాన్‌ సన్నాహాలు ముమ్మరం చేసినట్లు స్పష్టంచేశారు మోదీ. పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారతే తమ ప్రాధాన్యాలని వివరించారు. 15 కోట్ల మంది గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా నేరుగా తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్‌ ఉపకరిస్తుందని మోదీ పేర్కొన్నారు.

కొత్తగా.. త్రిదళాధిపతి

త్రివిధ దళాల మధ్య మరింత సమన‌్వయం కోసం త్రిదళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌) పోస్టును సృష్టించామని గుర్తుచేశారు ప్రధాని.

మోదీ లేఖ.. పేజీ 2
మోదీ లేఖ

ఇదీ చూడండి:'మోదీ సారథ్యంలో ఉజ్జ్వల భారతం వైపు వడివడిగా..'

Last Updated : May 30, 2020, 10:44 AM IST

ABOUT THE AUTHOR

...view details