ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11.30 గంటలకు నామపత్రాలు సమర్పించనున్నారు. 9.30 గంటల సమయంలో భాజపా కార్యకర్తలతో సమావేశమవుతారు మోదీ. ఆ తర్వాత కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నామపత్రాల దాఖలుకు వెళతారు.
వారణాసిలో నేడు ప్రధాని మోదీ నామినేషన్ - elections
వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమానికి బిహార్ సీఎం నితీశ్ కుమార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సహా ఎన్డీఏ మిత్రపక్షాల ముఖ్యనేతలు హాజరుకానున్నారు. పలుపురు కేంద్రమంత్రులు, భాజపా నేతలు కార్యక్రమంలో పాల్గొంటారు. కాలభైరవ ఆలయంలో పూజల అనంతరం నామినేషన్ దాఖలు చేసేందుకు వెళతారు ప్రధాని మోదీ
మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని ఎన్డీఏ ఐక్యతను ప్రదర్శించేందుకు వినియోగించుకోవాలని భాజపా భావిస్తోంది. అందుకే ఈ కార్యక్రమానికి మిత్రపక్షాల నేతలను ఆహ్వానించింది. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నితీశ్ కుమార్, శిరోమణి అకాలీ దళ్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్‌జన శక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాసవాన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే సహా మరిన్ని మిత్రపక్షాల నేతలు హాజరుకానున్నారు.
కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, పియూష్ గోయల్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరి సహా భాజపా ముఖ్యనేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు.