'ఎస్సీఓ దేశాలతో బంధాలు బలోపేతం చేసుకుంటాం' కిర్గిస్థాన్లో తాను జరపనున్న పర్యటన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కిర్గిస్థాన్ రాజధాని బెష్కెక్లో గురు, శుక్రవారాల్లో జరగనున్న ఎస్సీఓ సమావేశాల్లో మోదీ పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ప్రపంచ భద్రత స్థితిగతులు, బహుముఖ ఆర్థిక సహకారం, ప్రజల మధ్య పరస్పరం సంబంధాల పురోగతిపై చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు. కిర్గిస్థాన్ అధ్యక్షుడు జీన్బెకోవ్తో కలిసి భారత్-కిర్గిజ్ వాణిజ్య మండలి తొలి సమావేశంలో పాల్గొంటానని వివరించారు.
జిన్పింగ్తో భేటీ..
ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్... ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మోదీ రెండోసారి ప్రధాని అయిన తరువాత ఈ ఇరువురు నేతలు భేటీ కానుండడం ఇదే మొదటిసారి.
పాక్ మీదుగా ప్రధాని వెళ్లరు
షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు పాకిస్థాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ ప్రయాణించరని విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) స్పష్టం చేసింది. పాక్ మీదుగా వెళ్తే బిష్కెక్కు మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు. అదే ఒమన్, ఇరాన్ల మీదుగా వెళ్తే ఏడు గంటల సమయం పడుతుంది.
ఇదీ చూడండి: WC19: ఫేవరేట్ జట్లలో గెలుపు ఎవరిది...?