కరోనా వైరస్ పెను సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16, 17 తేదీల్లో దేశంలోని ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులతో మాట్లాడనున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించి అన్‌లాక్-1 ప్రారంభమైన తర్వాత ఆయన సీఎంలతో మాట్లాడనుండటం ఇదే తొలిసారి. క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులను ముఖ్యమంత్రుల ద్వారా తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాల్లో రాష్ట్రాల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకోవడానికి ప్రధానమంత్రి ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే హోంమంత్రి అమిత్‌షా అందరు ముఖ్యమంత్రులతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపాయి. మరోవైపు కేంద్రమంత్రులు తమకు అప్పగించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రోజువారీగా మాట్లాడుతూ పరిస్థితులను తెలుసుకొని ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారాన్ని పంపుతున్నట్లు తెలిసింది.
ఈనెల 17న కేసీఆర్, జగన్‌లతో ప్రధాని భేటీ - ఈనెల 17న జగన్, కేసీఆర్‌తో ప్రధాని భేటీ
దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో.. ప్రధాని మోదీ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 16,17 తేదీల్లో ఈ సమావేశం జరగనుంది.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో..
ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలు 70% పునఃప్రారంభమైన నేపథ్యంలో వచ్చే సమావేశంలో ఆ అంశాల కంటే కరోనా కట్టడిపైనే విస్తృతస్థాయి చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థికరంగం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న తరుణంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదని అభిప్రాయపడ్డాయి. ప్రధానమంత్రితో జరిగే సమావేశాన్ని రెండు భాగాలుగా విభజించారు. తమను విస్మరించారన్న భావన రాకుండా అందరి అభిప్రాయాలు తెలుసుకోవడానికే ఈ సుదీర్ఘ మథనాన్ని షెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రులతో రెండు రోజుల పాటు వరుసగా సాయంత్రం 3 గంటల నుంచి ప్రధాని సమాలోచనలు జరుపబోతున్నారు. తాజా షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యంత్రులతో మోదీ 17న మాట్లాడతారు.