భారతీయుల కలల సాకారానికి గుర్తుగా నిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. దిల్లీలో ప్రస్తుత పార్లమెంట్ భవనానికి సమీపంలోనే ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన భవనాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్రం... ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు చెబుతోంది.
ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నారు. మరో రెండేళ్లలో స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నూతన భవనంలోనే ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.
అత్యాధునిక సాంకేతికతతో
రూ. 971 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాటా సంస్థ దక్కించుకుంది. దీనికి హెచ్సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేస్తోంది. ఈ భారీ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తుండగా.. వాటిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి ప్రత్యేక మార్గాన్ని కేటాయించారు. లోక్సభ సభాపతి, రాజ్యసభ చైర్పర్సన్, ఎంపీలలకు ఓ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
- మొత్తంగా 64 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం
- అధిక తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునే సామర్థ్యం
- నాలుగు అంతస్తుల్లో నూతన పార్లమెంట్ భవనం
- భూగర్భంలోని లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో 20 మంత్రుల కార్యాలయాలు, గ్రౌండ్ ఫ్లోర్లో 18 కార్యాలయాలు
- మొదటి అంతస్థులో 26, రెండో అంతస్థులో 28 కార్యాలయాల నిర్మాణం
- లోక్సభకు ఆనుకొనే ఉండే విధంగా ప్రధాన మంత్రి కార్యాయం
ఈ నిర్మాణాన్ని దేశీయ వాస్తు రీతుల్లో నిర్మించడం మరో ముఖ్యమైన విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులను ఈ నిర్మాణాల్లో చూడవచ్చని అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులను నిర్మాణంలో భాగస్వాములను చేసింది కేంద్రం.
సకల సౌకర్యాలతో
ప్రస్తుతం చట్ట సభ్యుల సంఖ్యకు తగిన సౌకర్యాలు లేవని భావిస్తున్న కేంద్రం.. నూతన పార్లమెంట్ భవనంలోని లోక్సభ ఛాంబర్లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్లో 384 సీట్లును ఏర్పాటు చేస్తోంది. పార్లమెంట్ కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా గదులు ఉండనున్నాయి. ఈ భవనంలో దాదాపు 120 పైగా ఇలాంటి కార్యాలయాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. లోక్సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం 480 సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ్యుల సీట్ల పరిమాణాన్ని కూడా పెంచనున్నారు.