అటల్ సొరంగాన్ని ప్రారంభించిన మోదీ హిమాచల్‌ప్రదేశ్‌లో మనాలి నుంచి లేహ్ వరకు నిర్మించిన కీలక అటల్ సొరంగ మార్గాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకుని.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో 9.2 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించింది.
ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకుర్, త్రిదళాదిపతి జనరల్ బిపిన్ రావత్, సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవాణే సహా పలువురు పాల్గొన్నారు.
ప్రత్యేకతలెన్నో..
ఈ సొరంగంతో మనాలి- లేహ్ మధ్య దూరం 46 కిలోమీటర్లు తగ్గిపోతుంది. అంతేకాదు దాదాపు 4- 5 గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. సైన్యాన్ని వేగంగా సరిహద్దులకు తరలించేందుకు ఇది కీలకం కానుంది. 9.02 కిలోమీటర్ల ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ పేరు పెట్టారు. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొనేలా, 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ సొరంగాన్ని నిర్మించారు.
ఏడాది పొడవునా అన్ని వాతావరణ పరిస్థితులు తట్టుకుని దీటుగా నిలబడే ఈ సొరంగ మార్గం.. మనాలిని లేహ్‌లోని లాహౌల్-స్పితి లోయతో అనుసంధానం చేస్తుంది. ఈ టన్నెల్ నిర్మాణంలో అత్యాధునిక సాంకేతికత వినియోగించారు. హిమాలయాల్లోని పీర్ పంజాల్ పర్వతశ్రేణిలో 3వేల మీటర్లు.. అంటే సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఈ టన్నెల్ నెలవై ఉంది. ఈ సొరంగ మార్గం దక్షిణ ద్వారం.. మనాలికి 25 కిలో మీటర్ల దూరంలో ఉండగా.. ఉత్తర ద్వారం.. లాహౌల్ లోయలోని తెలింగ్ గ్రామం వద్ద ఉంది.
ఇదీ చూడండి: అద్భుత నిర్మాణం అటల్ టన్నెల్ ప్రత్యేకతలివే..