నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్టు కేంద్రం తెలిపింది. 2021 జనవరి 23న బోస్ జన్మదినాన్ని పురస్కరించుకుని.. ఏడాది పొడవునా జరిగే అన్ని కార్యక్రమాలను కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుందని.. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసినట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది.
ఈ మేరకు 85 మంది సభ్యులతో కూడిన కమిటీ వివరాలను వెల్లడించింది కేంద్రం. వారిలో విశిష్ట గుర్తింపు పొందిన వ్యక్తులు, చరిత్రకారులు, రచయితలు, నిపుణులు, బోస్ కుటుంబీకులతో సహా.. ఆజాద్ హింద్ ఫౌజ్(ఐఎన్ఏ)తో సంబంధం ఉన్న ప్రముఖులూ ఉన్నారు.
ఎవరెవరు ఉన్నారంటే..
- పలువురు కేంద్ర మంత్రులు
- బెంగాల్, మణిపూర్, అండమాన్ నికోబర్ గవర్నర్లు
- బంగాల్, ఒడిశా, నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ ముఖ్యమంత్రులు
- బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్జి
- లోకసభ స్పీకర్, మాజీ స్పీకర్లు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, పార్లమెంటు సభ్యులు, పలువురు సినీ, క్రీడా ప్రముఖులు
- కాబినెట్, హోం కార్యదర్శులు
- పీఎంఓ ముఖ్యకార్యదర్శి
- పలువురు ఎమ్మెల్యేలు
- పలువురు స్వాతంత్ర్య సమరయోధులు
- ఐఎన్ఏ సభ్యులుగా చేసిన వారు
- నేతాజీ కుటుంబ సభ్యులు
- నేతాజీ ట్రస్ట్ సభ్యులు
- పలువురు రచయితలు, కళాకారులు
- మాజీ ఆర్మీ చీఫ్
- బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలి, సినీ నటి కాజల్, సంగీత దర్శకుడు రెహమాన్, నటుడు మిథున్ చక్రవర్తి తదితరులు సభ్యులుగా ఉన్నారు.
దిల్లీ, కోల్‌కతా సహా.. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌తో సంబంధం ఉన్న ఇతర ప్రదేశాలలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ఈ కమిటీ మార్గనిర్దేశం చేయనుంది.
ఇదీ చదవండి:ఇస్రో దశాబ్ద ప్రణాళిక- కే.శివన్ మాటల్లో?