దేశాన్ని పచ్చదనం-పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమానికి మరో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 2019వ సంవత్సరానికి వ్యాపారవేత్త బిల్‌గేట్స్ నేతృత్వంలోని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ 'గ్లోబల్ గోల్ కీపర్' అవార్డును ప్రకటించింది. సెప్టెంబర్ 24న అమెరికాలో ఈ అవార్డును స్వీకరించనున్నారు మోదీ.
అంతర్జాతీయ సమాజ లక్ష్యాలను చేరుకునేందుకు తమ దేశం, ప్రపంచ స్థాయిలో అంకితభావం, సమర్థతతో ప్రభావశీలంగా పనిచేసే నేతలకు ఏటా గ్లోబల్ గోల్ కీపర్ పేరుతో అవార్డు అందిస్తుంది బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్. స్వచ్ఛభారత్‌పై చేసిన కృషికి ఈ ఏడాది మోదీని ఈ అవార్డుతో సత్కరించనుంది. ఈ అవార్డు అందించే గ్లోబల్ బిజినెస్ ఫారం వేదికగా అంతర్జాతీయ నేతలు, కార్పొరేట్ దిగ్గజాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ.
ఈ అవార్డులు.. ప్రపంచంలోని గొప్ప వ్యక్తుల గురించి తెలియజేస్తాయని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్స్ తెలిపింది. ప్రపంచంలో ఉన్న అసమానతలపై పోరాడటానికి 'గోల్ కీపర్స్' కృషి చేస్తారని అభిప్రాయం వ్యక్తం చేసింది.