భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించాలని కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ డిమాండ్ చేశారు. దేశం ఎదుర్కొనే ప్రతి ముఖ్యమైన విషయాలపై మోదీ ప్రసంగించినప్పుడు.. ఇది కూడా అంతే ముఖ్యమైన విషయమని పేర్కొన్నారు. నెల రోజుల నుంచి అత్యంత ప్రధానమైన సమస్యపై కేంద్రం మౌనం వహిస్తూ వచ్చిందని ధ్వజమెత్తారు.
"వ్యూహాత్మక ప్రదేశాల్లో అతిక్రమణలు చోటుచేసుకుంటున్నాయి. సైనిక నిపుణులు ఈ విషయంపై ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ మౌనాన్ని ప్రజలు సహించడం లేదు. ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రతి ముఖ్యమైన సందర్భంలో జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధానమంత్రి. ఈ సమస్య కూడా ముఖ్యమైనదేనని నా అభిప్రాయం."
--అధీర్ రంజన్ చౌధురీ, కాంగ్రెస్ సభాపక్షనేత
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రామిక్ రైళ్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు చౌధురీ. ఈ రైళ్లను డెత్ పార్లర్లుగా అభివర్ణించారు. రైల్వే శాఖ సరైన ప్రణాళిక, నిర్వహణ లేకుండా పని చేయడం వల్ల రైళ్లు రోజుల తరబడి ఆలస్యంగా నడిచినట్లు పేర్కొన్నారు. ఫలితంగా వివిధ కారణాలతో 90 మంది ప్రయాణికులు మరణించినట్లు ఆరోపించారు.
సరైన ప్రణాళిక లేకుండా లాక్ డౌన్ విధించారని మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు అధీర్.
వలస కార్మికుల దుస్థితిని ప్రభుత్వం ఎప్పుడూ తీవ్రంగా పరిగణించలేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లేకపోవడం వల్ల నిస్సహాయులైన కార్మికులు కాలినడకనే తిరిగి స్వస్థలాలకు బయల్దేరారు. ఇదంతా ప్రణాళిక లేని లాక్ డౌన్ వల్లే. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం. దీని వల్ల భారత్ ప్రతిష్ఠకు భంగం వాటిల్లింది.