కరోనా మహమ్మారితో ప్రపంచ మానవాళి మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమన్నారు. సంకల్పం, సంయమనంతో ముందుకు సాగితేనే కరోనాపై విజయం సాధ్యమని చెప్పారు మోదీ.
కరోనా భయంతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. వైరస్ను ఎదుర్కొనేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
" కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు రెండు ముఖ్యమైన విషయాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. మొదటిది సంకల్పం, రెండోది సంయమనం. ఈరోజు దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు తమ సంకల్పాన్ని చూపించాలి. వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశ పౌరులుగా తమ విధులను నిర్వర్తించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా బాధ్యతలు గుర్తించి తమకు రాకుండా, ఇతరులకు సోకకుండా జాగ్రత్తపడాలన్నారు మోదీ. అవసరం లేకుండా ఇంట్లో నుంచి కాలు బయటపెట్టవద్దని సూచించారు. నిర్లక్ష్యంగా ఉండటం.. మనకు ఏమవుతుందనే ధోరణి విడనాడాలని పిలుపునిచ్చారు.