దేశవ్యాప్తంగా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఆహార భద్రతకు అదే ముఖ్యమని, తమ ప్రభుత్వం అందుకోసం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. శాస్త్రీయ పద్ధతిలో పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూనే దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్లలో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేస్తున్నట్లు ప్రధాని వివరించారు.
ప్రపంచ ఆహార దినోత్సవం రోజున ఆహారం-వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రూ.75 విలువగల నాణెం విడుదల చేశారు మోదీ. ప్రపంచ ఆహార సంస్థకు నోబెల్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధాని.. ఆ సంస్థ విజయంలో భారత్ పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న మహిళల పౌష్టికాహారలోపంపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ..వారికి పౌష్టికాహారం అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. చిన్నవయస్సులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు కావడం, వారికి గర్భదారణ జరిగి.. తల్లి బిడ్డ పోషకాహారలోపంతో బాధపడడాన్ని ప్రస్తావించారు. ఆడపిల్లల పెళ్లి వయస్సుకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని.. ఆ అంశం మీద దేశంలోని నలుమూలల నుంచి లేఖలు వస్తున్నాయని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదలవుతోందని చెప్పారు.