కరోనాతో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు మేలు చేకూర్చేలా బిహార్ కేంద్రంగా 'గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన' పథకాన్ని ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. గ్రామీణ భారతంలో జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో బిహార్, ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, యోగి ఆదిత్యనాథ్, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తొలుత ఇక్కడే..
బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లోని.. 116 జిల్లాలలో ఈ కార్యక్రమం అమలుచేస్తారు. ఈ 116 జిల్లాలలో 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తారు. సాధారణ సేవల కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా 116 జిల్లాలలోని గ్రామాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన ద్వారా 50వేల కోట్లతో గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించే 25 రకాల పనులను చేపడతారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సహా 12 మంత్రిత్వశాఖల సమన్వయంతో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి:భారత గగనతలంలోకి పాక్ డ్రోన్.. కూల్చిన భద్రతా దళాలు