దేశంలోని రైతులను అన్నదాతలుగా మాత్రమే కాకుండా విద్యుత్తు దాతలుగా మార్చేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్‌లోని సౌర విద్యుత్ కోసం ఉద్దేశించిన కిసాన్ సూర్యోదయ యోజన సహా గిర్నార్ పర్వత ప్రాంతంలో అతిపెద్ద రోప్‌వే, అహ్మదాబాద్‌లోని గుండె ఆసుపత్రిని ప్రధాని దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
గత ఆరేళ్లలో కేంద్రం తీసుకున్న చర్యల వల్ల సౌర విద్యుత్తు రంగంలో భారత్ ప్రపంచంలోనే ఐదో స్థానంలో ఉందని వెల్లడించారు మోదీ. రోప్‌వే ప్రాజెక్టు జాప్యానికి ప్రతిపక్షాలే కారణమని విమర్శించారు. అడ్డంకులు సృష్టించి ఉండకపోతే.. గతంలోనే అందుబాటులోకి వచ్చేదన్నారు.
" దేశ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, వ్యవసాయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి.. నిరంతరం కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశంలో రైతులను అన్నదాతలుగా మాత్రమే కాకుండా విద్యుత్ దాతలుగా మార్చడానికి కూడా పని చేస్తున్నాం. రైతు ఉత్పాదక సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు.. బంజరు భూముల్లో చిన్న సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో సహాయం చేస్తున్నాయి. దేశంలోని లక్షలాది రైతుల సౌర విద్యుత్ ప్లాంట్లను గ్రిడ్‌తో అనుసంధానిస్తున్నాం. పొలాల్లో ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్‌ను రైతులు అవసరాల మేరకు తమ వ్యవసాయానికి వినియోగించుకోవచ్చు. మిగిలిన విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు ."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కిసాన్ సూర్యోదయ యోజన