కరోనా నియంత్రణపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాబోయే రోజుల్లో టెస్టులు నిర్వహించడం సహా బాధితుల్ని గుర్తించడం, ఐసోలేషన్, క్వారంటైన్పైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. 9 రోజులుగా దేశంలో లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితులపైనా ఆరా తీశారు.
కరోనా నియంత్రణకు రాష్ట్రాలన్నీ ఏకమై పోరాడటం ప్రశంసనీయమన్నారు మోదీ. లాక్డౌన్ ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా సీఎంలతో చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలన్నారు.
''ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కరోనా కట్టడికి స్వచ్ఛంద, సంక్షేమ సంస్థలు, సామాజికవేత్తల సాయం తీసుకోవాలి. కరోనా హాట్స్పాట్లను యుద్ధప్రాతిపదికన గుర్తించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం అత్యంత అవసరం.''
- వీసీలో మోదీ
కొవిడ్-19 బాధితుల కోసం.. ప్రత్యేకంగా ఆసుపత్రుల ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కోరారు ప్రధాని. అత్యవసర వైద్య ఉత్పత్తి పరికరాల సరఫరా, ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడిపదార్థాల లభ్యతకు అవసరమైన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు.