తెలంగాణ

telangana

By

Published : Mar 20, 2020, 5:08 AM IST

Updated : Mar 20, 2020, 10:12 AM IST

ETV Bharat / bharat

'కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ'

కరోనాపై యుద్ధంలో దేశ ప్రజలు.. స్వీయ సంకల్పం, స్వీయ నిర్బంధం పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. వచ్చే ఆదివారం నాడు ఇళ్లలో నుంచి ఎవరూ బయటకి రాకుండా జనతా కర్ఫ్యూ పాటించాలని కోరారు. మహమ్మారిని తలచుకొని భయపడటం మాని.. స్వీయపరిశుభ్రత, స్వయం నియంత్రణతో మెలగాలని సూచించారు. దేశంలో ఉన్న సంపన్నులు తమ వద్ద పనిచేసే వారి ఆర్థిక అవసరాలను పెద్దమనసుతో తీర్చాలని చెప్పారు. ఆర్థిక రంగంపై పడుతున్న సవాళ్లను అధిగమించేందుకు.. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

PM Modi has gave some suggestions to the people to prevent Corona spread in India
కరోనాపై యుద్ధం కోసం.. వచ్చే ఆదివారం జనతా కర్ఫ్యూ

ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 భారత్‌లో విస్తరించకుండా నిరోధించే చర్యలపై ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజలనుద్దేశించి అనేక సూచనలు చేశారు. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలకంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్న కరోనాపై నిశ్చింతగా ఉండడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా వైరస్​ పట్ల ఉదాసీన వైఖరి సరికాదన్న మోదీ.. కేంద్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తతతో ఉందని చెప్పారు.

వ్యాక్సిన్ లేదా చికిత్సలేని ఈ మహమ్మారి ఇప్పటివరకూ వెలుగుచూసిన అనేక దేశాల్లో.. ఆరంభంలో నెమ్మదిగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత ఒక విస్ఫోటనంలా మారిందన్నారు. లక్షలాది మందికి సోకి.. వేలాది మంది ప్రాణాలు తీస్తున్న విషయాన్ని కేంద్రం గమనంలో ఉంచుకొని అనేక జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వివరించారు.

స్వీయ సంకల్పం, స్వీయ నియంత్రణ తప్పనిసరి..

ఈ మహమ్మారిపై విజయం సాధించడంలో ప్రతిఒక్కరూ ప్రభుత్వానికి గతంలో మాదిరిగానే సహకరించాలని.. ఈ మేరకు స్వీయ సంకల్పం, స్వీయ నియంత్రణ పాటించాలని మోదీ విజ్ఞప్తి చేశారు.

'ఈ ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు అంశాలు చాలా ముఖ్యం. మొదటిది సంకల్పం, రెండోది నియంత్రణ. 130కోట్ల మంది భారతీయులు సంకల్పం తీసుకోవాలి. ఈ మహమ్మారిని నియంత్రించేందుకు ఓ పౌరుడిగా మన బాధ్యతలు మనం నిర్వర్తిద్దాం. వైరస్‌ సోకకుండా మనల్ని మనం రక్షించుకోవడం సహా.. ఇతరులకు వ్యాపించకుండా కాపాడదామనే సంకల్పం తీసుకుందాం. ఇలాంటి ప్రపంచ మహమ్మారి విషయంలో ఒకే మంత్రం పనిచేస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటే ప్రపంచం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వైరస్‌కు మందు లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండటం అత్యంత ఆవశ్యకం.'

- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

జనతా కర్ఫ్యూ పాటించాలని..

కరోనా సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సంకల్పబలంతో ముందుకు రావాలన్న ప్రధాని మోదీ... వచ్చే ఆదివారమే దానిని చాటాలని కోరారు. ఇందుకు ఆదివారం రోజు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిలుపునిచ్చారు.

'దేశపౌరులను మరో కోరిక కోరుతున్నా. అది.. జనతా కర్ఫ్యూ అంటే... జనం కోసం, జనమే తమకు తాము విధించుకునే కర్ఫ్యూ. ఈ ఆదివారం(22వ తేదీ) ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు దేశ ప్రజలందరూ జనతా కర్ఫ్యూను ఆచరించాలి. జనతాకర్ఫ్యూ విజయం, ఈ అనుభవం.. రానున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు మనల్ని తయారుచేస్తుంది. ఈ జనతాకర్ఫ్యూను విజయవంతం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ నేను కోరుతున్నాను.'

- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు..

కొద్ది వారాల పాటు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని కోరిన ప్రధాని.. నిత్యావసరాలను అవసరం మేరకే తీసుకోవాలని సూచించారు. భయాందోళనలకు గురై ఎక్కువగా కొనుగోలు చేయొద్దని, ప్రభుత్వం ప్రజల అవసరాలు తీరుస్తుందని హామీ ఇచ్చారు.

'మనకేమీ కాదనుకుంటూ.. మార్కెట్లకు పోతూ, రోడ్లమీద తిరుగుతూ కరోనా రాదులే అనుకోవద్దు. నేను చెప్తున్నాను ఈ ఆలోచన సరైంది కాదు. ఇలా ఇష్టమొచ్చినట్లు చేయడం అంటే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేసినట్లే అవుతుంది. అందుకే వచ్చే కొద్ది వారాల పాటు మరీ అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దు. ఏ మేరకు వీలైతే ఆ మేరకు.. మీ వ్యాపారం కానీ ఆఫీస్ పనులు కానీ ఇంటినుంచే చక్కబెట్టుకోవడానికి ప్రయత్నించండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్పత్రుల్లో చేసేవాళ్లు, ప్రజా ప్రతినిధులు, మీడియాలో పనిచేసే వాళ్లు బయటకు రాక తప్పదు. వీళ్లు మినహా సమాజంలో మిగిలిన వాళ్లు.. తమను తామే ఇంట్లోనే నిర్బంధించుకోవాలి. మన ఇళ్లల్లో 65ఏళ్లు పైబడిన వాళ్లెవరైనా ఉంటే కొద్ది వారాల పాటు ఇళ్లకే పరిమితమవ్వండి.'

- నరేంద్రమోదీ, ప్రధాన మంత్రి

సంపన్న వర్గాల సహాకారం అవసరం..

ఈ సమయంలో దేశంలోని సంపన్న వర్గాలు.. వారి వద్ద పని చేసే వారి ఆర్థిక అవసరాలను తీర్చాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అవసరమైన సందర్భంలో ఒకడుగు ముందుకేసి మరీ సాయమందించాలని సూచించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి వేతనాల్లో కోతలు పెట్టొద్దని అభ్యర్థించారు. దేశ ఆర్థికరంగంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించేందుకు టాస్క్‌ఫోర్స్ వేసినట్లు మోదీ చెప్పారు.

'కరోనా మహమ్మారితో.. ఆర్థిక రంగంపై పడుతున్న ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఆర్థికమంత్రి నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటైంది. ఇది రాష్ట్రాల భాగస్వామ్యంతో ఏర్పాటైంది. వారందరి సలహాలను స్వీకరిస్తుంది. అన్నీ పరిస్థితులను ఆకళింపు చేసుకుంటుంది.రానున్న రోజుల్లో ఎన్ని ఆర్థిక సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించేందుకు ఈ టాస్క్‌ఫోర్స్‌ కృషి చేస్తుంది.'

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

ఆస్పత్రులపై ఒత్తిడి పడకుండా సాధారణ చెకప్‌లు కొద్దిరోజులు వాయిదా వేసుకోవాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానికసంస్థలు, గ్రామ పంచాయతీలు, ప్రజా ప్రతినిధులు సర్వశక్తులూ ఒడ్డి... వైరస్‌ను ఎదుర్కోవడంలో ముందుండి నడిపించాలని విజ్ఞప్తి చేశారు. అటు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న వైద్యసిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విమానయాన సిబ్బంది, మీడియా సేవలను మోదీ కొనియాడారు.

Last Updated : Mar 20, 2020, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details