అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను పెంచడానికి పర్యావరణ న్యాయశాస్త్రాన్ని దేశ న్యాయవ్యవస్థ పునర్లిఖించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన కీలక తీర్పులను 130 కోట్ల మంది భారతీయులు.. ఎలాంటి అనుమానాలు, భయాలు లేకుండా హృదయపూర్వకంగా స్వాగతించారని ప్రధాని అన్నారు.
సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తోన్న అంతర్జాతీయ న్యాయ సదస్సు-2020ని ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థపై ప్రశంసలు కురిపించారు. సమన్యాయం లేకుండా ప్రపంచంలో ఏ దేశం, సమాజం అభివృద్ధి చెందదన్నారు. ట్రాన్స్జెండర్ల చట్టాలు, ముమ్మారు తలాక్, దివ్యాంగులకు హక్కులు కల్పించినట్లు గుర్తు చేశారు. సైన్యంలో మహిళలకు స్థానం కల్పించామని.. 26 వారాల మాతృత్వ సెలవులను కల్పిస్తున్నట్లు చెప్పారు.
" భారతీయ సమాజంలో న్యాయ వ్యవస్థ నియమాలు సామాజిక సంస్కారంపై ఆధారపడి ఉంటాయి. న్యాయవ్యవస్థ రాజులకే రాజు, చట్టమే సర్వోన్నతమైనది. 130 కోట్ల మంది భారతీయులు తమ సమస్యలను న్యాయ వ్యవస్థ ద్వారానే పరిష్కరించుకుంటున్నారు. వేల సంవత్సరాల నుంచి భారత న్యాయ వ్యవస్థ ప్రజల నమ్మకాన్ని చూరగొంటోంది. అదే మన రాజ్యాంగానికి ప్రేరణ. మన రాజ్యాంగానికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. రాజ్యాంగం న్యాయవాదుల చేతిలోని ప్రతులు కావని.. అది మన జీవితాలను నడిపించే ఒక వాహకం అని రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ పేర్కొన్నారు. "