ప్రభుత్వాధినేతగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇరవయ్యో ఏడాదిలో అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ 7న ఆయన మొదటిసారిగా సీఎంగా ప్రమాణం స్వీకరించారు.
అప్పటినుంచి 2014 మే నెలలో దేశప్రధానిగా బాధ్యతలు చేపట్టే వరకు ఏ ఎన్నికల్లోనూ ఆయన ఓటమి చూడలేదు. పోటీ చేసిన ప్రతిసారి మరింతగా ప్రజావిశ్వాసాన్ని పొందడం ఆయనకే సాధ్యమైందని, అది మోదీ దీక్షాదక్షతకు నిదర్శనమని భాజపా వర్గాలు పేర్కొంటున్నాయి.
'చెక్కుచెదరని సంకల్పం..'
'ఆత్మ నిర్భర్ భారత్' ఆయన తుది లక్ష్యమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పారు.
"అవిశ్రాంత పనితీరు, గొప్ప దార్శనికత మోదీ విజయాలకు హేతువులు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన అత్యున్నత స్థాయిలో నిలుస్తున్నారు. నిరంతరం తనకు తాను సవాల్ విసురుకుంటూ, బహిరంగంగా లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వాటిని సాధించడం ప్రధానికి అలవాటు. అధికార యంత్రాంగంలో ఉన్న అలసత్వాన్ని ఆయన వదిలించారు. పారిశుద్ధ్యం, గ్రామీ విద్యుదీకరణ, గృహ నిర్మాణం, తాగునీరు వంటి ముఖ్యమైన పథకాలన్నీ సకాలంలో పూర్తయ్యేలా చూశారు. రాయితీలు అలవాటైన దేశంలో.. ప్రజలే స్వచ్ఛందంగా వాటిని వదిలేసేలా మోదీ చేయగలిగారు. తద్వారా నిరుపేదలకు ఉచిత వంటగ్యాస్ అందుతోంది" అని నడ్డా పేర్కొన్నారు.