ఖేలో ఇండియా పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరచి, ఫిట్నెస్పై దేశ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఖేలో ఇండియా కార్యక్రమం భారత క్రీడారంగాన్ని మరో దశకు తీసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.
ఒడిశాలో జరుగుతున్న ఖేలో ఇండియా ప్రప్రథమ అంతర్ విశ్వవిద్యాలయ క్రీడా పోటీలను దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధాని. భారత క్రీడారంగానికి చారిత్రక దినంగా అభివర్ణించారు.
"ఖేలో ఇండియా పోటీల్లో మీరు చేస్తున్న కృషి... మీ కలలు, మీ కుటుంబాలు, దేశ కలలను నిజం చేస్తుంది. మీరు పోటీల్లో గెలవాలి. ఫిట్నెస్ దిశగా దేశాన్ని చైతన్యం చేయాలి. ఈ సంకల్పంతో మీరు మైదానంలో పోటీల్లో పాల్గొనాలి. ఈ కార్యక్రమం ఒక టోర్నమెంట్ ప్రారంభోత్సవం మాత్రమే కాదు. భారత్ క్రీడారంగంలో మరో శకానికి ఆరంభం. ఖేలో ఇండియా అభియాన్ దేశం నలుమూలలా క్రీడల పట్ల ఆసక్తి, యువ క్రీడాకారులను కనుగొనడంలో ముఖ్య భూమిక పోషిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు చెందిన క్రీడాకారులు గత ఖేలో ఇండియా పోటీల్లో అద్భుత ప్రదర్శన చేశారు. భారత క్రీడారంగంలో నూతన ఆశలను రేకెత్తించారు."