పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ కొందరు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించారని.. విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమర వీరుల మరణం పట్ల దుఃఖంలో ఉన్న తనను ఎన్నో మాటలన్నారని తెలిపిన మోదీ.. వాటన్నింటినీ సహించినట్టు వెల్లడించారు. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ ఐక్యతా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని.
పుల్వామా ఉగ్రాదాడిని తమ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వ విజయంగా అభివర్ణించింది పాకిస్థాన్. ఆ దేశ పార్లమెంట్ వేదికగా ఓ మంత్రి ఈ వ్యవహారంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దేశంలో స్వార్థపూరిత రాజకీయాలకు పాల్పడే వారి నిజస్వరూపం బయటపడిందన్నారు మోదీ. నీచ రాజకీయాలను మానుకోవాలని సర్దార్ సాక్షిగా అభ్యర్థిస్తున్నట్టు పేర్కొన్నారు మోదీ.
"(పుల్వామా దాడి) జవాన్ల మరణ వార్త విన్న సమయంలో దేశ ప్రజలంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కానీ కొందరు ప్రజల దుఃఖంలో పాలుపంచుకోలేదు. ఈ విషయాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. పుల్వామా ఉగ్రదాడి సమయంలోనూ వీరు రాజకీయాలు చేశారు. ఎలాంటి మాటలన్నారో దేశ ప్రజలు మర్చిపోరు. ఎలా భయపెట్టారో మర్చిపోరు. దేశం విలవిలాలడుతున్న సమయంలో స్వార్థపూరిత రాజకీయాలు చేసిన వారిని దేశం మర్చిపోదు. అప్పుడు... అమర వీరులను చూస్తూ నేను వివాదాలకు దూరంగా నిలబడ్డాను. ఎన్ని ఆరోపణలు చేసినా పడ్డాను. తప్పుడు మాటలు మాట్లాడినా సహించాను. జవాన్ల మరణంతో నా మనస్సు దుఃఖించింది. కానీ.. పొరుగు దేశం(పాకిస్థాన్) నుంచి ఇటీవలే ఓ వార్త వచ్చింది. ఆ దేశ పార్లమెంట్‌లోనే నిజాన్ని బయటపెట్టారు. దీంతో ఆరోపణలు చేసే వారి నిజస్వరూపం బయటపడినట్టు అయ్యింది. స్వార్థపూరిత రాజకీయాల కోసం వారు ఎక్కడి వరకైనా వెళతారనేది పుల్వామా ఉదంతంతో ప్రజలకు తెలిసొచ్చింది. వారందరనీ నేను ప్రార్థిస్తున్నా. దేశ హితం కోసం దయ చేసి ఇలాంటి రాజకీయాలు చేయకండి."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.