కరోనా సంక్షోభం ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భర్ భారత్ అవసరాన్ని తెలియజెప్పిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 'నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్' ప్రారభిస్తున్నట్లు ప్రకటించారు.
ఆరోగ్య భారతం: ప్రతి పౌరుడికీ హెల్త్ ఐడీ జారీ - స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు 2020
దేశ పౌరుల కోసం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ అందిస్తామని, తద్వారా వారి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. దేశంలోని ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా.. కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని వివరించారు.
నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ దేశ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని మోదీ ఉద్ఘాటించారు. ప్రతి పౌరుడికి ప్రత్యేక నంబర్(హెల్త్ ఐడీ)తో వైద్య కార్డు అందించనున్నట్లు తెలిపారు. పౌరుల ఆరోగ్యం, అప్పటివరకు పొందిన వైద్యం వివరాలన్నీ కార్డులో నిక్షిప్తమై ఉంటాయని వెల్లడించారు.
దేశంలో ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా కార్డు ద్వారా వివరాలు తెలుస్తాయని చెప్పారు మోదీ. వైద్యులతో అపాయింట్మెంట్, చికిత్స సహా హెల్త్ ఐడీతో అన్ని సేవలు ఆన్లైన్లోనే లభ్యమవుతాయని తెలిపారు.