74వ స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో కీలక మార్పులకు దోహదం చేస్తుందని తెలిపారు.
ఏంటీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్?
- టెక్నాలజీ ఆధారంగా దేశ ప్రజలందరికీ వైద్య సేవలు అందించే కార్యక్రమం.
- దీని కింద ప్రతి భారతీయుడికి హెల్త్ ఐడీ కేటాయిస్తారు.
- హెల్త్ ఐడీ ఆధారంగా ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు.
హెల్త్ ఐడీ అంటే?
- ప్రతి ఒక్కరికీ ఆధార్ తరహాలో ఇచ్చే విశిష్ట సంఖ్యే హెల్త్ ఐడీ.
- ఈ నెంబర్ ద్వారా వారి ఆరోగ్య రికార్డులు నమోదు చేస్తారు.
- వైద్యుడు లేదా ఫార్మసీకి వెళ్లిన ప్రతిసారి జాతీయ స్థాయిలో ఆ సమాచారం మొత్తం కార్డులో నిక్షిప్తమవుతుంది.
- ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ ఆధారంగా ఆరోగ్య సమాచారాన్ని అక్కడి వైద్యులు పరిశీలించేందుకు వీలు కలుగుతుంది.
ఏ సమాచారం నిక్షిప్తమవుతుంది?
- మనం చేయించుకున్న వైద్య పరీక్షల వివరాలు.
- ఇదివరకు వైద్యులు సూచించిన మందులు.
- గతంలో ఏం చికిత్స తీసుకున్నారనే విషయాలు.
- ఆ వ్యక్తికి వర్తించే ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, బీమా వివరాలూ ఉండే అవకాశం.