బొగ్గు గనుల వేలంలో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ
కరోనా సంక్షోభాన్ని భారత్ అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడటం తగ్గించి స్వావలంబన సాధించాల్సిన అవసరాన్ని ఈ విపత్తు గుర్తుచేసిందని అన్నారు. వాణిజ్య మైనింగ్ కోసం 41 బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ విధంగా వ్యాఖ్యానించారు మోదీ.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసగించిన మోదీ.. విద్యుత్ రంగంలో భారత్‌ను స్వయం సమృద్ధి సాధించే దిశగా బొగ్గు గనుల వేలం కీలక నిర్ణయమని అభిప్రాయపడ్డారు.
"దశాబ్దాలుగా బొగ్గు ఉత్పత్తి రంగం వలలో బందీగా చిక్కుకుపోయింది. ఈ రంగంలో పోటీతత్వం పూర్తిగా కొరవడింది. ఫలితంగా పారదర్శకత లోపించింది. 2014 తర్వాత ఈ పరిస్థితిని మార్చేందుకు తీసుకున్న చర్యలతో బొగ్గు ఉత్పత్తి రంగం బలపడింది."
- ప్రధాని నరేంద్రమోదీ
3.5 లక్షలమందికి ఉపాధి..
దేశ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి, పారిశ్రామిక వృద్ధిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా బొగ్గు మంత్రిత్వ శాఖ వాణిజ్య మైనింగ్ కోసం 41 బ్లాకుల వేలం ప్రక్రియ చేపట్టింది. వచ్చే ఐదేళ్లలో బొగ్గు గనుల వాణిజ్య మైనింగ్ ద్వారా దాదాపు రూ.33 వేల కోట్ల మూలధనం సృష్టించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రక్రియ ఆత్మ నిర్భర భారత్ అభియాన్ కింద చేపట్టినట్లు పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ గనుల ద్వారా దాదాపు 22.5 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలోని మొత్తం బొగ్గు ఉత్పత్తిలో వీటి వాటా 15 శాతంగా ఉంటుందని వెల్లడించింది. బొగ్గు నిక్షేపాల వేలం ద్వారా దాదాపు 2.80 లక్షల మందికి ప్రత్యక్షంగా, 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని వివరించింది.