ఎన్నో విషయాలపై కరోనా సంక్షోభం ప్రభావం చూపించినప్పటికీ.. 130కోట్ల మంది భారతీయుల ఆశయాలను అడ్డుకోలేకపోయిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం( యూఎస్ఐఎస్పీఎఫ్) మూడో వార్షిక సదస్సులో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆత్మనిర్భర్ భారత్ అంశాన్ని ప్రస్తావించారు ప్రధాని.
"దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దాలని 130కోట్ల మంది భారతీయులు సంకల్పించారు. ఇది భారత శక్తిని పెంపొందించి.. అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించేందుకు ఉపయోగపడుతుంది. దేశంలో ఎన్నో సవాళ్లున్నాయి. అదే సమయంలో ఫలితాలను అందించగలమన్న విశ్వాసం ఉన్న ప్రభుత్వం ఇక్కడుంది. సులభతర వాణిజ్యంతో పాటు సులభతర జీవితం కూడా ముఖ్యం."
---- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
సామర్థ్యం, ప్రజా ఆరోగ్య-ఆర్థిక వ్యవస్థకు కరోనా సంక్షోభం ఎన్నో సవాళ్లు విసిరిందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొత్త ఆలోచన విధానాన్ని ఏర్పరచుకోవాలని వెల్లడించారు.