చిన్న రైతులను శక్తిమంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వ్యవసాయం రంగంలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నిధితో గ్రామీణ భారతంలో మౌలిక వసతులు పెరుగుతాయని, ఉద్యోగాలను సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిధి ద్వారా...
ఈ నిధి ద్వారా పంట ఉత్పత్తుల నిల్వ కోసం శీతల గిడ్డంగులు, పంట సేకరణ కేంద్రాలు వంటి సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తుంది. దీనిలో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకూ నిధులు ఇవ్వనుంది.
ఇందుకోసం 11 ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర వ్యవసాయశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 2280మంది రైతులకు దాదాపు రూ. వెయ్యి కోట్లను విడుదల చేసినట్టు ప్రధాని వెల్లడించారు.