కరోనా కారణంగా మందగించిన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది కేంద్రం. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ, దేశీయ పెట్టుబడిదారులకు ప్రోత్సాహం కల్పించేందుకు అవసరమైన వ్యూహాలపై సమగ్ర సమావేశాన్ని నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పారిశ్రామిక ప్రాంతాల్లోని స్థలాల్లో మౌలిక వసతుల కల్పనకు తగిన ఆర్థిక సాయం అందించే పథకంపై అధికారులతో చర్చించారు. పెట్టుబడిదారులకు మరింతగా సహకరించే విధానాలను అనుసరించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
నిర్ణీత సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని అనుమతులు వచ్చేలా, వారి సమస్యలు పరిష్కరించాలని నిర్దేశించారు. దేశీయ రంగాలను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులు తీసుకొచ్చే అంశంపైనా ఈ సమావేశంలో ప్రధాని చర్చించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.