తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన మోదీ'

భారత భూభాగాన్ని ప్రధాని నరేంద్రమోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. సైనికులకు ఆయుధాలు ఇవ్వకుండా మంత్రులు నిద్రపోతున్నారని విమర్శించారు. ఇందుకు సంబంధించి ఓ సైనికుడి తండ్రి వీడియోను పోస్ట్ చేశారు రాహుల్. దీనిపై స్పందించిన జవాను తండ్రి.. ఈ విషయంపై రాజకీయం చేయవద్దని రాహుల్​కు సూచించారు.

CONG-RAHUL-CHINA
రాహుల్ గాంధీ

By

Published : Jun 20, 2020, 12:04 PM IST

భారత్-చైనా వివాదానికి సంబంధించి ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని ఆరోపించారు.

శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో సరిహద్దు ఉద్రిక్తతలకు సంబంధించి ప్రధాని వివరణ ఇచ్చారు. భారత భూభాగంలో ఎవరూ చొరబడలేదని మోదీ ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి రాహుల్ ఈ విధంగా స్పందించారు.

"చైనా దురాక్రమణకు భారత భూభాగాన్ని ప్రధాని మోదీ అప్పగించారు.

ఒకవేళ అది చైనా భూభాగమైతే.. మరి భారత సైనికులు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వాళ్లు అక్కడ ఎలా చనిపోయారు?"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు ప్రధానిని కాపాడేందుకు అబద్ధాలు ఆడుతున్నారని రాహుల్ ఆరోపించారు. భారత జవాన్లు సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తోంటే కేంద్రం నిద్ర పోతోందని ట్విట్టర్​ ద్వారా విమర్శించారు.

చైనీయులు దాడి చేసినప్పుడు భారత సైనికుల వద్ద ఆయుధాలు లేవని ఘర్షణలో గాయపడ్డ ఓ జవాను తండ్రి చెబుతున్న వీడియోను రాహుల్ పోస్ట్​కు జతచేశారు. భారత సైనికుల వద్ద ఆయుధాలు ఎందుకు లేవని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాజకీయాలు చేయొద్దు..

తన మాటలను ఉపయోగించి ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ విమర్శించటాన్ని ఆ సైనికుడి తండ్రి ఖండించారు. ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని సూచించారు.

"భారత సైన్యం చాలా దృఢమైనది. చైనాను ఓడించే శక్తి ఉంది. ఈ విషయంలో రాహుల్ గాంధీ రాజకీయాలు చేయవద్దు. నా కుమారుడు సైన్యంలో పోరాడుతున్నాడు. పోరాడుతూనే ఉంటాడు."

- సైనికుడి తండ్రి

భారత్-చైనా వివాదానికి సంబంధించి కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ కేంద్రం విమర్శలు చేస్తూనే వస్తున్నారు. సైనికుల వద్ద ఆయుధాలు ఎందుకు లేవని పదే పదే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి విదేశాంగ మంత్రి జైశంకర్​ వివరణ ఇచ్చారు. రెండు దేశాల మధ్య ఎలాంటి ఘర్షణ తలెత్తినా ఆయుధాలను ఉపయోగించకూడదని గతంలో చేసుకున్న ఒప్పందాలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'

ABOUT THE AUTHOR

...view details