తొమ్మిదో తరగతి చదివే ఓ బాలిక పాడిన పాట ప్రధాని నరేంద్ర మోదీని మెప్పించింది. కేరళలోని కేంద్రీయ విద్యాలయంలో 9వ తరగతి చదివే దేవిక అనే అమ్మాయి ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ కార్యక్రమంలో భాగంగా చంబా కిత్ని దూర్ అనే ప్రముఖ హిమాచల్ గీతాన్ని ఆలపించింది. ఆమె పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ప్రధాని మోదీ మనసు గెలుచుకున్న చిన్నారి పాట - ప్రధాని మోదీ మనసు గెలుచుకున్న చిన్నారి పాట
కేరళకు చెందిన ఓ చిన్నారి గాత్రానికి ప్రధాని మోదీ సైతం ఫిదా అయ్యారు. హిమాచలీ భాషలో తను పాడిన పాట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చిన్నారికి మోదీ శనివారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. స్వయంగా ప్రధాని తనని ప్రశంసించటంతో చిన్నారి ఆనందానికి హద్దులు లేవు. ఇప్పటి వరకు దాదాపు 40లక్షల మంది ఈ పాటను ఆస్వాదించారు.
ఆమె పాటకు ముగ్ధుడైన ప్రధాని ట్విటర్ వేదికగా దేవికను అభినందించారు. ఆమె పాట వన్ ఇండియా గ్రేట్ ఇండియా అవసరాన్ని బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.
అటు దేవిక పాటకు ఫిదా అయిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తమ రాష్ట్రానికి రావాల్సిందిగా దేవికను ఆహ్వానించారు. మధురమైన గానంతో.. తమ రాష్ట్ర ప్రజల మనసుల్నిగెలుచుకుందని ఆ బాలికను ప్రశంసించారు. రాష్ట్ర అతిథిగా సత్కరిస్తామన్నారు. మరోవైపు ప్రధాని నుంచి అభినందనలు రావడాన్ని ఊహించలేదన్న దేవిక పాట పాడేందుకు ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపింది.