కరోనా పరీక్షలు, సెరో సర్వే.. రెండింటినీ పెంచాలని అధికారులను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోదీ. వేగవంతమైన, చౌకైన టెస్టింగ్ సదుపాయం అందరికీ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. సంప్రదాయ ఔషధ చికిత్సలు, కఠినమైన శాస్త్రీయ పరీక్ష, ధ్రువీకరణ అవసరాన్ని నొక్కి చెప్పారు.
వ్యాక్సిన్ పరిశోధనపై సమీక్ష
కరోనా వ్యాక్సిన్ పరిశోధన, అభివృద్ది వ్యవహారాలపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మోదీ. పరీక్ష సాంకేతికతలు, కాంటాక్ట్ ట్రేసింగ్, డ్రగ్స్, థెరపెటిక్స్ మొదలైన వాటితో సహా కరోనాను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యుడు, ప్రధాన శాస్త్రీయ సలహాదారు, సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు ఈ రివ్యూ సమావేశానికి హాజరయ్యారు.
ప్రభుత్వం మద్దతు..
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు.. భారతీయ వ్యాక్సిన్ అభివృద్ది, తయారీదారులు చేస్తున్న కృషిని ప్రశంసించారు మోదీ. వ్యాక్సిన్ అభివృద్ది కోసం చేస్తున్న అన్ని ప్రయత్నాలకు ప్రభుత్వ మద్దతును కొనసాగించడానికి కట్టుబడి ఉన్నట్లు సమీక్షలో స్పష్టం చేశారు.
వాటిపై దృష్టిసారించాలి
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక పంపిణీి కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు మోదీ. తగినంత వ్యాక్సిన్ సేకరణ కోసం యంత్రాంగాలు, పెద్ద మొత్తంలో నిల్వ చేసేందుకు అవసరమైన విధానాలు, అదే తరహాలో క్షేత్ర స్థాయి వరకు పంపిణీ కోసం తీసుకోవాల్సిన చర్యలపై కీలక దృష్టి సారించాలని మరోసారి అధికారులకు సూచించారు.
భారత్కు మాత్రమే కాకుండా.. మొత్తం ప్రపంచానికి టెస్టింగ్, వ్యాక్సిన్, మందులు అన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని.. వీటిని అవకాశం ఉన్నంత తక్కువలో లభ్యమయ్యేందుకు ఉన్న పరిష్కార మార్గాలను అన్వేషించాలన్నారు. దృఢ సంకల్పంతో ప్రజలకు వ్యాక్సిన్ సహా ఇతర ఔషధాలు ఖర్చు తక్కవలో అందించేందకు సంకల్పంతో పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రధాని.
ఇదీ చూడండి:'సరైన తిండి తినకపోతే రూ.11 లక్షల కోట్లు ఖర్చు'