సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు మేరకు అయోధ్య ఆలయ నిర్మాణం కోసం ఓ ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు 'శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర' పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేసింది. ఇదే విషయాన్ని లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
"కోర్టు తీర్పును అనుసరించి అయోధ్యలో రామమందిరం నిర్మాణంతో పాటు.. మిగిలిన అంశాలకు సంబంధించి ఒక పథకాన్ని మా ప్రభుత్వం రూపొందించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్‌ను ఏర్పాటు చేశాం. ఈ ట్రస్ట్.. ఆయోధ్యలో రామమందిర నిర్మాణం, ఇతర విషయాలపై పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
గతేడాది నవంబరు 9న తీర్పు
అయోధ్య భూవివాదంపై గతేడాది నవంబర్ 9న సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమి హిందువులకే చెందుతుందని స్పష్టం చేసింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
15మందితో ట్రస్ట్...
శ్రీరామ్ తీర్థక్షేత్రలో మొత్తం 15మంది ట్రస్టీలుగా ఉండనున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీకి చెందిన వారికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ట్వీట్టర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
'షా' ట్వీట్ చేసిన కొద్దిసేపటికి.. దిల్లీలోని గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో ట్రస్ట్‌కు సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ట్రస్ట్ కార్యాలయం(ఆర్-20, గ్రేటర్ కైలాశ్ పార్ట్-1, న్యూ దిల్లీ, 110048) ఉండే నివాసం.. న్యాయవాది పరాశరన్‌కు చెందినది. ఆయన రెండుసార్లు అటార్నీ జనరల్‌గా పనిచేశారు. అయోధ్య కేసులో హిందువుల తరఫున వాదించిన ముఖ్య న్యాయవాది కూడా ఆయనే.