కరోనాపై పోరాటంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ కారణంగా కుదేలైన వివిధ రంగాలను ఆదుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీతో ముందుకొచ్చింది. కుంగిపోయిన వ్యవస్థలకు ఊతవివ్వడమే ధ్యేయంగా 'ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్' పేరుతో ఏకంగా రూ. 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు నరేంద్ర మోదీ. దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ 10 శాతం ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీ ద్వారా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఊతమిస్తామన్నారు. నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు సైతం ప్యాకేజీ దోహదపడుతుందని పేర్కొన్నారు. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టు ప్యాకేజీకి రూపకల్పన చేశామని ప్రధాని వివరించారు.
నేరుగా జేబుల్లోకి
కరోనాపై పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ ప్యాకేజీ చేయూతనిస్తుందని చెప్పారు ప్రధాని. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుకుపుకొని పోయేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ప్యాకేజీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి రూపాయీ ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుందని స్పష్టం చేశారు.
ఈ ప్యాకేజీ ద్వారా కుటీర, గృహ సంబంధిత పరిశ్రమలు, చిన్నతరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈలకు ఊతం లభిస్తుంది. నిజాయతీగా పన్నుచెల్లించే దేశ మధ్యతరగతి వారి కోసం ఈ ఆర్థిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాం.రేపటి నుంచి ఆత్మ నిర్భర్ అభియాన్‌పై ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారు. ఆత్మనిర్భర భారతాన్ని సాధించేందుకు కొన్ని ధైర్యమైన సంస్కరణలు అవసరం.
-నరేంద్ర మోదీ, ప్రధాని.
ఆపదను అవకాశంగా..
కరోనా సంక్షోభం తెచ్చిన ఆపదలను భారత్ అవకాశాలుగా మార్చుకుందని మోదీ స్పష్టం చేశారు. మనం స్వతంత్రంగా ఎదగడమే ఏకైక మార్గమన్నారు. భారత్‌లో వనరులు, ప్రతిభ ఉన్నాయని తద్వారా ఉత్తమ ఉత్పత్తులను తయారు చేసి నాణ్యత, సరఫరా గొలుసును మెరుగుపర్చవచ్చని తెలిపారు. మనవద్ద తయారయ్యే వస్తువులను ప్రపంచానికి కూడా ఇవ్వాలనేదే మన దృక్పథం కావాలన్నారు.